మూడు రాజధానులకు సిపియం వ్యతిరేకం

మూడు రాజధానులకు సిపియం వ్యతిరేకం

భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ  

ఈ రోజు విజయవాడలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం ఈ క్రింది తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రచురణార్థం విడుదల చేస్తున్నాం.

- జె.ప్రభాకర్‌, ఆఫీసు కార్యదర్శి

జిఎన్‌రావు సారధ్యంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు కొత్త వివాదాన్ని సృష్టించాయి. ప్రజల మధ్య అనైక్యతకు ఇది దారితీస్తుంది. వివిధ రాజకీయ పక్షాలు, ప్రజల మధ్య ఏకాభిప్రాయం కోసం ప్రయత్నం చేసిన తరువాతే తుది నిర్ణయం తీసుకోవాలని, అందాక యథాతథ స్థితిని కొనసాగించాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గం డిమాండ్‌ చేసింది. తక్షణం నివేదికను బహిర్గతపరచాలని, అఖిలపక్ష సమావేశం జరపాలని కోరుతున్నది.
రాష్ట్ర విభజన తరువాత అమరావతిలో రాజధాని ఏర్పాటుపై నాడు వైఎస్సార్‌సిపితో సహా అన్ని పక్షాలు అంగీకరించాయి. అయితే అమరావతి పాలనా కేంద్రంగానే ఉండాలని, దాని చుట్టూ ప్రతిపాదించిన అభివృద్ధి పథకాలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు సమానాభివృద్ధి చెందే విధంగా వికేంద్రీకరించాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేసింది. రైతుల నుండి భూ సమీకరణ పేరుతో వేలాది ఎకరాలు మభ్యపెట్టి తీసుకోవడాన్ని వ్యతిరేకించాము. భిన్నాభిప్రాయాలను పెడ చెవినపెట్టి నాడు చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా ముందుకెళ్ళాడు. వారి మాటలను నమ్మిన రాజధాని రైతాంగం ఈరోజు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నది.
నిపుణుల కమిటీ రాజధాని అమరావతి అంటూనే పరిపాలనా కేంద్రంగా విశాఖను ప్రతిపాదించడం ప్రజలకు అదనపు ఇక్కట్లను సృష్టిస్తుంది. వారు పేర్కొన్న దక్షిణాఫ్రికా లాంటి పద్దతి కేవలం అధ్యక్షతరహా పరిపాలన ఉండే దేశాల్లోనే సాధ్యం. వారు కూడా అనుభవం తర్వాత పునరాలోచనలో పడ్డారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మంత్రివర్గం ఒకచోట, సెక్రటేరియట్‌ మరోచోట వలన సమన్వయ సమస్యలొస్తాయి. ప్రజలు ఇక్కట్లపాలవుతారు. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, అధికారులకు కూడా ఇది ఇబ్బంది కలిగిస్తుంది. అందువలన ఈ ప్రతిపాదనతో సిపిఐ(యం) విభేధిస్తుంది. కమిటీ సిఫార్సు చేసినట్లుగా హైకోర్టు కర్నూలులో, అమరావతి, విశాఖల్లో బెంచ్‌లు పెట్టడం సమర్థనీయమే.
పార్టీలు మారినప్పుడల్లా రాజధానులు మార్చడం మంచి సాంప్రదాయం కాదు. రాష్ట్రాభివృద్ధికి కూడా తోడ్పడదు. స్వీయ రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాల కోసం ప్రజల మనోభావాలతో చెలగాటమాడటం మంచిది కాదు. వికేంద్రీకరణ అంటే అభివృద్ధి ప్రాజెక్టులను వెనుకబడిన ప్రాంతాలకు తరలించడం, ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు ప్రాధాన్యతనివ్వడం, స్థానిక సంస్థలకు ఎక్కువ అధికారాలు, నిధులు ఇవ్వడమని అర్థం. కానీ పాలనా వికేంద్రీకరణ పేరుతో రోజువారీ పరిపాలనను అస్థవ్యస్థం చేసుకోకూడదు. 4 ప్రాంతీయ మండళ్ళను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా అస్పష్టంగా వుంది. దీనికున్న ప్రాతిపదికను ప్రజలకు వివరించాలి.
గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర రాజధానికి నిధులివ్వకుండా ఎండగడుతూ కేంద్ర బిజెపి పక్షపాతంతో వ్యవహరిస్తున్నది. ఈ అన్యాయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించడం లేదు. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షం కూడా మౌనంగా వుంది. కేంద్రం చేస్తున్న అన్యాయాలపై రాష్ట్రంలోని వివిధ పక్షాలను, ప్రజలను సమీకరించి ప్రత్యేకహోదా, విభజన హామీల సాధనకై పోరాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. రాష్ట్ర బిజెపి నాయకత్వం తమ దోషాన్ని కప్పిపెట్టుకోవడానికి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నది. ఏ ప్రాంతానికాప్రాంతం మాట వినిపిస్తూ అవకాశవాదంలో ప్రజలను మోసం చేస్తున్నది.
కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రజల మధ్య వైషమ్యాలను పెంచే వివాదానికి తెరదించాలని, రాజధానిపై ఏకాభిప్రాయాన్ని సాధించి రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై కేంద్రీకరించాలని ప్రభుత్వానికి సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది.