బాక్సర్‌గా వరుణ్‌ తేజ్‌

బాక్సర్‌గా వరుణ్‌ తేజ్‌ చిత్రం

వైవిధ్యమైన కథా చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు వరుణ్‌ తేజ్‌. ఈ ఏడాది 'ఎఫ్‌ 2', 'గద్దలకొండ గణేష్‌' చిత్రాలతో హిట్స్‌ను సొంతం చేసుకున్న వరుణ్‌ తేజ్‌ హీరోగా గురువారం హైదరాబాద్‌ ఫిలింనగర్‌ దైవ సన్నిధానంలో కొత్త చిత్రం ప్రారంభమైంది. అల్లు అరవింద్‌ సమర్పణలో  రెనసాన్స్‌ ఫిలింస్‌, బ్లూ వాటర్‌ క్రియేటివ్‌ పతాకాలపై కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో సిద్ధు ముద్ద, అల్లు వెంకటేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు క్లాప్‌ కొట్టగా, కొణిదెల సురేఖ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. అల్లు అరవింద్‌ గౌరవ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్‌, అల్లు బాబీ, సిద్ధు ముద్ద కలిసి హీరో వరుణ్‌ తేజ్‌, డైరెక్టర్‌ కిరణ్‌ కొర్రపాటి స్క్రిప్ట్‌ను అందించారు. 

ఈ సందర్భంగా దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి మాట్లాడుతూ... డిఫరెంట్‌ సినిమాలు చేయడానికి ప్రాధాన్యతనిచ్చే వరుణ్‌ తేజ్‌ కథ వినగానే వెంటనే ఓకే చెప్పారు. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. ఈ సినిమా కోసం అమెరికాకు వెళ్లి ప్రత్యేకమైన శిక్షణ తీసుకుని వరుణ్‌ చాలా మేకోవర్‌ అయ్యారు.  మ్యూజిక్‌ సెన్సేషన్‌ తమన్‌ సంగీతం, జార్జ్‌ సి.విలియన్స్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్‌ కె.వెంకటేశ్‌ ఎడిటింగ్‌ వర్క్‌ చేస్తున్నారు. డిసెంబర్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది. సినిమాలోని మిగతా నటీనటులు, టెక్నీషియన్స్‌ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం' అన్నారు.