ఎన్‌ఎంసీతో ప్రజారోగ్యానికి ప్రమాదం

ఎన్‌ఎంసీతో ప్రజారోగ్యానికి ప్రమాదం

 

       కేంద్ర ప్రభుత్వం హడావుడిగా తెచ్చిన ‘నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ)’ బిల్లు ప్రజల గుండెలపై కుంపటి వంటిది. బిల్లుపై కేంద్రం పసలేని వాదనలెన్నో చేస్తున్నది. అవినీతిని అరికట్టడం, వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ నిర్దేశాల మేరకు డాక్టర్ల సంఖ్యను పెంచడం, వైద్య విద్యలో నాణ్యత పెంచడం... వంటి ప్రయోజనాలను సాధించడం కోసమే ఎన్‌ఎంసీని తెచ్చినట్టు ప్రకటించింది. ఈ వాదనల్లోని అసహజత్వాన్ని, నిజానిజాలను ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) బయటపెట్టినప్పటికీ, ఈ సమస్య పట్ల అది కమిట్‌మెంట్‌తో సీరియన్‌గా వ్యవహరించలేదు. పసలేని ప్రభుత్వ వాదనలను బాహాటంగా ఖండించలేకపోయింది. వ్యతిరేక పోరాటాన్ని నిర్మించలేదు. దీని వల్ల ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గ్రహించిన వైద్య విద్యార్థి లోకం దేశవ్యాప్తంగా ఆందోళనలతో ఉద్యమాలు చేసింది. కానీ, ఎందుకో ఉద్యమం ఉధృతమై ప్రజల్లోకి వెళుతున్న క్రమంలో సమ్మెను విరమించుకుంది. మరో పక్క ఈ ఆందోళనలను మీడియా కూడా తక్కువ చేసి చూపించింది. ఎన్‌ఎంసీ వల్ల వైద్య విద్యార్థులకు, వైద్యులకే కాదు ప్రజా వైద్యానికి కూడా తీవ్ర ప్రమాదం ఏర్పడుతుంది. నకిలీ డాక్టర్లు పుట్టుకొచ్చి ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలవుతాయి. అంతేకాదు, వైద్యం మరింత కార్పొరేటీకరణ, ప్రయివేటీకరణ జరుగుతుంది. దానితో ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేకుండా పోతే, ప్రయివేటు ఖరీదైపోయి, అందని ద్రాక్ష అవుతుంది. వైద్య రంగాన్ని ‘రెగ్యులేట్‌’ చేసే ఎంసీఐ స్థానంలో రానున్న ఎన్‌ఎంసీకి ఛైర్మన్‌గా ఉండే వారిని (వైద్యులు కాని వారిని కూడా) ప్రభుత్వం నామినేట్‌ చేస్తుంది. ఆ విధంగా ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ చెప్పుచేతల్లో ఉండడమే కాదు, రాజకీయవ్యవస్థలా తయారవుతుంది. డాక్టర్ల సంఖ్య పెంపు పేరిట ఇది బీఎస్సీ, ఫార్మా కోర్సులు చేసిన వారికి బ్రిడ్జి కోర్సులు ఇప్పించి డాక్టర్లుగా ప్రకటిస్తుంది. ఇదే విధంగా వైద్యవిద్యలో ప్రస్తుతం ఉన్న 15 శాతం మేనేజ్‌మెంట్‌ కోటా 50 శాతానికి చేరుతుంది. వీటి వల్ల జరిగే పర్యవసానాలేమిటో, సమాజానికి ఇవి ఎంత నష్టదాయకమో మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఎన్‌ఎంసీ ప్రజల ధన, మాన, ప్రాణాలతో చెలగాటమాడుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
 

డాక్టర్‌ చంద్రభాను
నేత్ర వైద్య నిపుణులు.