జార్జ్‌రెడ్డిలో యాక్షన్‌ ఎక్కువ!

జార్జ్‌రెడ్డిలో యాక్షన్‌ ఎక్కువ!

నటీనటులు: సందీప్‌ మాధవ్‌-అభయ్‌ బేతిగంటి-సత్యదేవ్‌-శత్రు-మనోజ్‌ నందం ముస్కాన్‌ తదితరులు

సాంకేతికవర్గం: ఛాయాగ్రహణం: సుధాకర్‌ యక్కంటి, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, నేపథ్య సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, నిర్మాతలు: సంజీవ్‌ రెడ్డి-అప్పిరెడ్డి-దాము రెడ్డి, రచన-దర్శకత్వం: జీవన్‌ రెడ్డి

    45 ఏళ్ళ క్రితం ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి నాయకుడు జార్జ్‌రెడ్డి కథను వెండితెర ఆవిష్కరణ జరుగుతుందనగానే సినిమాపై ఆసక్తినెలకొంది. అప్పట్లో అతనొక భగత్‌సింగ్‌, చెగువేరాలా విద్యార్థులకు కన్పించేవాడు. అలాంటి వ్యక్తి కథ ఇప్పుడు ఎందుకు తీయాల్సివచ్చిందనేది పక్కన పెడితే ఇంకా ఆనాటి అరాచకాలు, కులవివక్షత అనేది ఇంకా పూర్తిగా పోలేదన్నది సుస్పష్టం. ఆమధ్య జరిగిన హైదరాబాద్‌ యూనివర్శిటీలో దళిత విద్యార్థి హత్య అందుకు నిదర్శనం. దేశాన్ని కుదిపేసిన ఆ సంఘటన లాంటిదే ఇంచుమించు అప్పట్లో జార్జ్‌రెడ్డి కథ కూడా. ఆయన కథను 'దళం' అనే చిత్రానికి దర్శకత్వం వహించిన జీవన్‌రెడ్డి భుజాన వేసుకున్నారు. ముగ్గురు నిర్మాతలు ముందుకు వచ్చారు. ఈరోజే విడుదలైన  ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.

కథ: 

చిన్నప్పట్నుంచి సైంటిఫిక్‌ ఆలోచనలతోపాటు ఆవేశంగా మెండుగా వున్న వ్యక్తి జార్జ్‌ రెడ్డి (సందీప్‌ మాధవ్‌). పీజీ చదివేందుకు ఉస్మానియా యూనివర్శిటీకి వస్తాడు. యూనివర్శిటీ వెలుపల, బయట సమస్యలు కనిపిస్తాయి. చూస్తూ ఊరుకోని జార్జ్‌ విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్లందరికీ బుద్ధి చెప్పడం మొదలుపెడతాడు. దాంతో అతన్నే తమ నాయకుడిగా విద్యార్థులు భావిస్తారు. అప్పటికే యూనివర్శిటీపై పట్టు సాధించిన వర్గానికి ఇది కంటగింపుగా మారుతుంది. వాళ్లు జార్జ్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడులు మొదలుపెడతారు. ఈ క్రమంలో తను వారిని ఎలా ఎదుర్కొన్నాడు! చివరికి అతడి కథకు ముగింపు ఏమిటనేది మిగిలిన సినిమా.

విశ్లేషణ:

ఈ సినిమాకు 'ఎ మ్యాన్‌ ఆఫ్‌ యాక్షన్‌' అని క్యాప్షన్‌ పెట్టినట్లుగా అడుగడునా ఫైట్లే కన్పిస్తాయి. అప్పటికాలంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తేచాలు అతనో నాయకుడు. అలా నాయకుడై దేశంలోని ఇతర యూనివర్శిటీలకు ఆదర్శంగా నిలవడం మామూలు విషయంకాదు. ఈయన ధైర్యాన్ని తెగింపు నాయకత్వ లక్షణాల్ని చూసి ఒకవైపు నగ్జలైట్లుకూడా చేయి కలుపుతారు. మరోవైపు ఈయన తెలివి తేటలకు ఇస్రో వంటి సంస్థ కూడా ఆఫర్‌ చేస్తుంది. ఇవేవీ కాదని కేవలం తమ యూనివర్శిటీలోని విద్యార్థుల్ని బాగుచేయాలనే తపనతో ప్రత్యర్థులు ఎదిరిస్తాడు. చివరికు నమ్మకస్తుడైన స్నేహితుడివల్లే ప్రత్యర్థుల వ్యూహానికి బలవుతాడు. అయితే ఇంతటి తెగుపు, ధైర్యం జార్జ్‌కు ఎలా వచ్చాయనేది దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. వాస్తవంగా తను చిన్నతనంలో భగత్‌సింగ్‌ గురించి చదివాడు. పెద్దయ్యాక చెగువేరాతోపాటు పలు దేశాల్లో నాయకుల చరిత్రలను యూనివర్శిటీ లైబ్రరీలో అవపోశసన పట్టాడు. మనిషిని మనిషిలా చూడాలనే మార్క్సిస్టు దృక్పథం అతనిలో బాగా నాటుకుపోయింది. తనకు కత్తిఫైట్లు, బాక్సింగ్‌ నైపుణ్యం వున్నాయి. అప్పట్లో బ్లేడ్‌ఫైట్స్‌ అనేవి వుండేవి. దాన్ని బాగా తెలుసుకున్న వ్యక్తి. అతనో మేధావి. ఎమ్మెస్సీ గోల్డ్‌ మెడలిస్ట్‌. పరీక్షల్లో అతడి సమాధాన పత్రం చూసి మంబయి యూనివర్శిటీ నుంచి ఒక ప్రొఫెసర్‌ వెతుక్కుంటూ ఉస్మానియా యూనివర్శిటీకి వచ్చేంత ప్రతిభ అతడిది. జార్జి రెడ్డి రచనలు.. ప్రసంగాల గురించి గొప్పగా చెబుతారు. వీటి గురించి చదువుతుంటే మనకు కలిగే గొప్ప అనుభూతి.. 'జార్జిరెడ్డి' సినిమా చూస్తే కలగదు. అతను ప్రధానంగా ఫైట్లు చేస్తూ నాయకుడిగా ఎదిగిన ఒక 'యాక్షన్‌' హీరోగానే సినిమాలో ప్రొజెక్ట్‌ చేశారు. జార్జి రెడ్డి జీవితాన్ని వాస్తవిక కోణంలో ఉద్వేగభరిత రీతిలో తెరపైకి తీసుకురావడం కంటే సగటు కమర్షియల్‌ సినిమాలో కథానాయకుడిలా అతడిని ప్రొజెక్ట్‌ చేయాలని చూడటంతో ఈ చిత్రం అంచనాలకు దూరంలో నిలిచిపోయింది. చాలా సన్నివేశాల్లో ఫీల్‌ కన్పించదు. కనీసం ముగింపు సన్నివేశంలోకూడా అలా చూపించకపోవడం ఆశ్చర్యం కల్గుతుంది.

    అప్పట్లో ఫైర్‌బాల్‌తో విద్యార్థిల్ని బెదిరిస్తుంటే తను అలా చేస్తాడు. తర్వాత నోటిలో బ్లేడ్‌పెట్టుకుని వాటిని ఎదుటివారిపై ఊదడం, కర్ఛీఫ్‌కు బ్లేడ్‌లు కట్టుకుని బ్రూస్‌లీ ఫైట్లు చేయడం చిత్రంలో ఆకట్టుకునే అంశాలు. ఇవి తప్పితే మిగిలినవన్నీ వాస్తవానికి దూరంగా వున్నాయనే చెప్పాలి. అయితే అప్పట్లో వున్న కులవివక్షత, అగ్రకులాలనుంచి అవమానాలు, ఫీజుల పెంపు, క్యాంటిన్‌లో రెండుప్లేటుల వ్యవస్థ, ఆత్మన్యూనతలు ఇలా ఎన్నో అంశాల్ని చకచకా చూపించేశాడు దర్శకుడు. విద్యార్థులు ఎలాంటి కష్టాల్లో వున్నా హాజరయ్యేవాడు. ఇన్ని లక్షణాలున్న జార్జ్‌ని ఓ అమ్మాయి ప్రేమిస్తుంది. అయినా సరిగ్గా పట్టించుకోడు. ఐతే సినిమాలో మాత్రం ప్రధానంగా ఎవడు తప్పు చేస్తే వాణ్ని కొట్టే సగటు తెలుగు 'హీరో'గానే ప్రొజెక్ట్‌ చేశారు. అతడి మిగతా శక్తుల్ని ఊరికే అలా అలా పైపైన చూపించేశారు. కాబట్టే 'జార్జిరెడ్డి' మనసు లోతుల్లోకి వెళ్లదు. తెలుగులో కొంత కల్పితమైనా బయోపిక్స్‌కు బెంచ్‌మార్క్‌గా నిలిచిన 'మహానటి'లో మాదిరి ప్రధాన పాత్రతో ఏర్పడ్డ ఎమోషనల్‌ కనెక్ట్‌ 'జార్జ్‌రెడ్డి'లో మిస్‌ అయింది.

అయినా, 70 నాటి ఉస్మానియా యూనివర్శిటీ వాతావరణాన్ని అభినందించదగ్గ రీతిలో తెరపైకి తీసుకొచ్చారు. కాలేజీ సన్నివేశాలంటే సహజంగానే యువ ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవుతారు. ప్రథమార్ధంలో కథనం వేగంగానే సాగిపోతుంది. యాక్షన్‌ ఘట్టాలు వేటికవే ప్రత్యేకంగా ఉండి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. కానీ ద్వితీయార్ధంలో కథను చెప్పాల్సిన చోట జీవన్‌ రెడ్డి బాగా తడబడ్డాడు.  ద్వితీయార్ధంలో ఎన్నికల రాజకీయాలు.. సామాజిక సమస్యలపై పోరాటం.. ఇవన్నీ పార్టులు పార్టులుగా విడిపోయాయి. 

    ఇక పాత్రపరంగా వంగవీటి' తర్వాత సందీప్‌ మాధవ్‌ ఒదిగిపోయిన తీరుకు బాగుంది. బాగా అలవాటైన నటుడిలా కనిపించడం అతడి ప్రత్యేకత. హీరోయిన్‌ ముస్కాన్‌ బాగానే చేసింది. ఆమె కూడా పాత్రకు తగ్గట్లుగా కనిపించింది. తన హావభావాలు ఆకట్టుకుంటాయి. మిగతా నటీనటుల్లో రాజన్నగా అభయ్‌ తనదైన ముద్ర వేశాడు. లలన్‌ పాత్రలో నటించిన వ్యక్తి బాగానే చేశాడు. సత్యదేవ్‌ పాత్ర ఆశించిన స్థాయిలో లేదు. కృష్ణచైతన్య, శత్రు, మనోజ్‌ నందం ముగ్గురూ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగతా నటీనటులు కూడా బాగా చేశారు.

సాంకేతికంగా సురేష్‌ బొబ్బిలి పాటలు ఓకే అనిపిస్తాయి. దానికంటే హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ నేపథ్య సంగీతం ప్రత్యేకంగా అనిపిస్తుంది. 'అర్జున్‌ రెడ్డి'కి దీటుగా అతను ఔట్‌ పుట్‌ ఇచ్చాడు. జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుకున్న సినిమాటోగ్రాఫర్‌ సుధాకర్‌ యక్కంటి.. తన కెమెరాతో మ్యాజిక్‌ చేశాడు. ఆర్ట్‌ డైరెక్టర్‌ గాంధీ సాయంతో 70ల నాటి ఉస్మానియా యూనివర్శిటీ వాతావరణాన్ని అతను తెరపైకి తీసుకొచ్చినా అక్కడక్కడా చిన్నపాటి లోపాలున్నాయి. సినిమా స్థాయికి మించిన నిర్మాణ విలువలు కనిపిస్తాయి. అందుకు నిర్మాతలు అభినందనీయులు. వాస్తవికతకు దగ్గరగా చూపించాలనే కేరళలో వున్నప్పుడు అక్కడి భాష, జార్జ్‌రెడ్డి కథను రీసెర్చ్‌ చేయడానికి యుఎస్‌.నుంచి వచ్చిన యువతి ఇంగ్లీషులోనూ, యూనివర్శిటీలో వున్నప్పుడు అప్పటి ఉర్దూభాషను చొప్పించి ఆకట్టుకున్నా కొన్ని లోపాలు లేకపోలేదు.

లోపాలు:

- తండ్రిలేని జార్జ్‌కి రెడ్డి అనేది ఎలా వచ్చిందనేది దర్శకుడు చెప్పకుండా కథను నడిపించాడు. దాంతో ఇప్పటివారికి అతనెలా రెడ్డి అయ్యాడనేది తెలీదు.

- వాస్తవికతను కల్పితం చేయడంలో కొంత మిస్‌ అయ్యాడు. జార్జ్‌రెడ్డి ఎప్పుడూ చెప్పులతోనే తిరిగాడనేది పుస్తకాల్లో రాసి వుంది. కానీ చాలాచోట్ల బూట్లు ధరిస్తాడు.

- ఇస్రో సంస్థలో ఇంటర్వ్యూకు వెళ్ళి సెలక్ట్‌ అయ్యాక.. చేతికి ఆర్డర్‌ ఇచ్చిన ఆఫీసర్‌తో మాట్లాడకుండా వచ్చేస్తాడు. దానికి సరైన కారణం చూపించలేకపోయాడు.

- జార్జ్‌రెడ్డిని దేశ విదేశాల్లోని ఆనాటి సమస్యలు కుదిపేస్తాయి. బెంగాల్‌ నగ్జల్బరీ, తెలంగాణలో నిరుద్యోగం, శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటం, అమెరికా సామ్రాజ్యవాదంపై విజయత్నాం ప్రజా పోరాటాలు ప్రభావితం చేస్తాయి. వాటిని రేడియోలోనో, పేపర్లలోనో చదివినట్లుగా విన్నట్లుగానూ చూపించకపోవడంతో ప్రేక్షకుడు కనెక్ట్‌కాలేకపోతాడు. కేవలం అతనుండే యూనివర్శిటీ సమస్య దేశ సమస్య ఎలా అయిందనేది క్లారిటీ లేకుండాపోయింది.