చెప్పింది చేయకూడదు: కె.ఎస్‌. రవికుమార్‌

చేసింది చెప్పకూడదు..

చెప్పింది చేయకూడదు: కె.ఎస్‌. రవికుమార్‌

       ''చేసే పనిపై ఏకాగ్రతతో ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు. ఆ ఏకాగ్రతే మనకు క్రమ శిక్షణ, అంకితభావం, నిజాయితీలను మనకు అలవరుస్తుంది'' అని అన్నారు ప్రముఖ దర్శకులు కేఏస్‌. రవికుమార్‌. రజనీకాంత్‌తో పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన తెలుగులో బాలకృష్ణతో 'రూలర్‌' చేశారు. వేదిక, సోనాలీ చౌహాన్‌ కథానాయికలుగా నటించారు. భూమిక కీలక పాత్రధారి. సి. కల్యాణ్‌ నిర్మించిన ఈ సినిమా ఈనెల20న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేఎస్‌ రవికుమార్‌ చెప్పిన విశేషాలు..

'రూలర్‌'కు ముందు బాలకృష్ణతో వేరే కథ అనుకున్నారుగదా? 

'రూలర్‌' సినిమాకు వేరే కథ అనుకున్నమాట వాస్తవమే. కానీ పరుచూరి మురళీ చెప్పిన కథ నచ్చడంతో కొన్ని చిన్న మార్పులతో 'రూలర్‌' సినిమా చేశాం.  ఆ కథను వద్దనుకోవడానికి పెద్ద కారణాలు కూడా ఏం లేవు. విడుదల చేసిన 'రూలర్‌' సినిమా ట్క్రెలర్‌లో బాలకృష్ణగారు డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపించారు. ఇందులో ఆయన క్యారెక్టర్‌లో షేడ్స్‌ ఉంటాయా? లేక డ్యూయెల్‌ క్యారెక్టర్‌ చేశారా? అన్న విషయాలను వెండితెర పై చూసి ఆడియన్స్‌ తెలుసుకోవాలి.

'రూలర్‌' ఎవరికి?

ఉత్తరప్రదేశ్‌లోని తెలుగువారికి చెందిన కథ ఇది. అందరి పాత్రలు బాగుంటాయి. సెకండాఫ్‌లో వచ్చే భూమిక పాత్ర సినిమాకు చాలా కీలకం. అందరూ బాగా నటించారు. ఈ సినిమా బాలకృష్ణగారి అభిమానులకే కాదు. ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. 'జైసింహా' తర్వాత వెంటనే నేను బాలకృష్ణగారితో 'రూలర్‌' సినిమా చేశాను. అందుకు ఆయన సిన్సియారిటీ, అంకితభావలే ముఖ్యకారణాలు. ఈ సినిమా కోసం బాలకృష్ణగారు బరువు తగ్గారు. ఉదయాన్నే మూడు గంటలకు నిద్రలేచి వర్కౌట్స్‌ చేసేవారట. ఆయన అంకితభావం నాకు నచ్చింది.

బాలకృష్ణ షార్ట్‌టెంపర్‌ అంటారుగదా.. ఎలా సింక్‌ అయింది?

తన అసిస్టెంట్లు తప్పు చేసినప్పుడు మాత్రమే బాలకృష్ణగారు సెట్‌లో కోప్పడతారు. అదీ కూడా అన్ని సందర్భాల్లో కాదు. అనుకున్న సమయానికి ప్రణాళిక ప్రకారం అన్ని సవ్వంగా జరగకపోతే సెట్‌లో నేనూ షార్ట్‌ టెంపరే.

సినిమాలో ఏ అంశాల్ని ప్రాదిపదికగా తీసుకుంటారు?

నా కెరీర్‌లో ముందుగా చిన్న సినిమాలు చేసి, ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నాను. ప్రస్తుతం హీరో ఇమేజ్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాను తెరకెక్కిస్తున్నాను. 'రూలర్‌' సినిమా సమయంలోనూ బాలకృష్ణగారి ఇమేజ్‌ని నేను గుర్తుపెట్టు కున్నాను. నా సినిమాల్లో వాణిజ్యపరమైన అంశాలు ఉంటునే నా శైలి విభిన్నతను చూపించాలని నేను అనుకుంటాను. పాటలు, పోరాట సన్నివేశాలు ఉన్నప్పుడు అది కమర్షియల్‌ మూవీయే. ఇటీవల తమిళంలో వచ్చిన 'అసురన్‌' చిత్రంలో కూడా పాటలు ఉన్నాయి. అయితే అసురన్‌ చిత్రాన్ని రియలస్టిక్‌గా తీశారు. అలా అని కమర్షియల్‌ సినిమాలే ముఖ్యం అని చెప్పడం లేదు. ఆర్ట్‌ సినిమాలు కూడా ముఖ్యమే.

దర్శకులుగా మీరేం చెప్పదలిచారు?

నా కెరీర్‌ మొదట్లో నేను దాదాపు పదేళ్లు నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాను. ఆ సమయంలో సినిమా ఎలా తీయాలి? అనే దానికంటే కూడా...ఒక సినిమా ఎందుకు ఫెయిల్‌ అవుతుంది? సినిమాను ఎలా తీయకూడదు? ఏం తప్పులు చేయకూడదు? అనే అంశాలనే ఎక్కువగా నేర్చుకున్నాను. ముఖ్యంగా దర్శకత్వంలో కొన్ని రూల్స్‌ వుంటాయి. అవి అందరూ పాటించాలి. అందులో ఒక రూల్‌ వుంది. 'చేసింది చెప్పకూడదు.. చెప్పింది చేయకూడదు' అదే నేను ఫాలో అవుతున్నా.

పెద్ద హీరోలతో త్వరగా ఎలా సినిమాలు చేయగలుగుతున్నారు?

ప్రీ ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను పక్కాగా ప్లాన్‌ చేసుకుంటే సినిమాను పెద్ద పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేసినప్పటికీని వెంటనే పూర్తి చేయవచ్చు. 'రూలర్‌' సినిమాను నాలుగు నెలల్లో పూర్తి చేశాం. గతంలో చిరంజీవిగారి 'స్నేహాంకోసం' సినిమాను 45 రోజుల్లోనే పూర్తి చేశాను. ఈ సినిమా తెరకెక్కించేప్పుడే రజనీకాంత్‌గారి 'నరసింహా' సినిమా డైలాగ్స్‌ రాసు కున్నాను. పెద్ద పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేసేప్పుడు ఈగో కాంఫ్లెక్స్‌ ఉండకూడదు. హీరో ఇమేజ్‌ని డైరెక్టర్‌ గౌరవించాలి. డైరెక్టర్‌ను హీరో గౌరవించాలి.

రజనీకాంత్‌తో సినిమా చేస్తారా?

రజనీకాంత్‌గారు, కమల్‌హాసన్‌గారితో నేను సినిమాలు చేశాను. ఏనాడు నా అంతట నేను సినిమా చేద్దామని వెళ్లలేదు. నాకు వచ్చిన అవకాశాలను ఎంచుకున్నాను. రజనీకాంత్‌గారు, కమల్‌హాసన్‌గారు రాజకీయాల్లోకి వస్తున్నారు. వారే కాదు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్నవారు ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చు. అవకాశాలు వస్తున్నాయి. కానీ చిన్న సినిమాలు చేయాలనుకోవడం లేదు. రజనీగారు కూడా ఇదే చెప్పారు. రజనీగారితో మరో సినిమా అంటే...ఆయన ప్రస్తుతం డైరెక్టర్‌ శివతో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత మరో సినిమా చేస్తారు. ఆ నెక్ట్స్‌ రాజకీయాల్లో బిజీ అవుతారు. రాజకీయాల్లోకి రావాలంటే ఇదే ఆయనకు ఆఖరి ఛాన్స్‌.

కొచ్చాడియన్‌ ఎందుకు తీయలేకపోయారు?

    అప్పట్లో అంతా రెడీ అయ్యేసరికి రజనీగారికి హెల్త్‌ బాగోలేదు. ఆ తర్వాత దాన్ని ఆపడం ఎందుకుని ఆయన కుమార్తె సౌందర్య చేశారు. రజనీకాంత్‌గారి 'కొచ్చాడియన్‌' (తెలుగులో 'విక్రమసింహా') సినిమాకు ప్రీక్వెల్‌కు ఐడియా ఉంది. కానీ దాదాపు 200కోట్ల బడ్జెట్‌ అవుతుంది. కొచ్చాడియన్‌ సినిమాకు నేనే రైటర్‌ని. యానీమేషన్‌ గురించి నాకు అంతగా తెలియదు అందుకే 'కొచ్చాడియన్‌' సినిమాకు దర్శకత్వం వహించలేదు. అలాగే రజనీకాంత్‌గారి 'నరసింహా' సినిమాను రెండు ఇంట్రవెల్స్‌లో రిలీజ్‌ చేయాలని అప్పట్లో అనుకున్నాం. అంత ఫుటేజ్‌ ఉంది. ఆ తర్వాత మాములుగానే విడుదల చేశాం.

ఈమధ్య నటుడిగా బిజీ అయ్యారే?

డెరెక్టర్స్‌కు యాక్టింగ్‌ ఈజీగా వస్తుంది. ఓ సినిమాను తెరకెక్కించేప్పుడు ఫలానా సన్నివేశం గురించి నటులకు వివరించేప్పుడు ఆ సన్నివేశంలో హీరో బాడీలాంగ్వేజ్‌ని బట్టి యాక్ట్‌చేసి చూపిస్తారు. అలా వారికి యాక్టింగ్‌ సులభంగానే వస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం నేను కొన్ని తమిళ సినిమాల్లో నటిస్తున్నాను. తెలుగులో రవితేజ సినిమాలో ఓ పాత్ర చేయాల్సింది. కానీ కుదర్లేదు. నేను డైరెక్ట్‌ చేయబోయే సినిమాల గురించి త్వరలోనే వెల్లడిస్తాను.