'శంకరాభరణం' పాటలు ఇప్పటికీ పాడుకుంటున్నారు...

'శంకరాభరణం' పాటలు ఇప్పటికీ పాడుకుంటున్నారు...

         ''ఇది 2020. 2060లోనూ ఈ సినిమా పాటలు పాడతారని నేను ప్రామిస్‌ చేస్తున్నాను. 'శంకరాభరణం'కు నేను పనిచేశాను. ఆ సినిమా పాటలు ఇప్పటికీ పాడుకుంటున్నారు. ఒక గొప్ప సినిమాకు, ఒక గొప్ప సంగీతం తోడైతే, అది వందేళ్లు నిలిచిపోతుంది. అలాగే ఈ సినిమాని వంద సంవత్సరాలు ఉంచుతారు. ఇది వాస్తవం. నేను కర్నూలులో ఈ సెలబ్రేషన్స్‌ పెట్టుకుందామని బన్నీతో అంటే, నాకు 'వైజాగే కావాలి' అన్నాడు. కోట్లాది మంది చూసిన సినిమాలో బన్నీ ఎలా చేశాడో చెబితే అపహాస్యంగా ఉంటుంది. మాకు కడుపు నిండిపోయింది. త్రివిక్రమ్‌కు మాటల మాంత్రికుడు అనే మాట తక్కువగా అనిపిస్తుంది. అతను మాటల మాంత్రికుడు కాదు, సెల్యులాయిడ్‌ తాంత్రికుడు. సినిమాను మాయచేశాడని'' నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు.

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా, త్రివిక్రమ్‌ డైరెక్ట్‌ చేసిన 'అల.. వైకుంఠపురములో' సినిమా బాక్సాఫీస్‌ దగ్గర రికార్డుల్ని బద్దలుకొడుతూ దూసుకుపోతోంది. పూజా హెగ్డే నాయికగా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌, ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించారు. మొదటి వారంలోనే 'అల వైకుంఠపురములో' మూవీ 180 కోట్ల రూపాయల గ్రాస్‌ వసూలు చేసి ఆల్‌ టైమ్‌ నాన్‌-బాహుబలి2 రికార్డుల్ని సృష్టించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం వైజాగ్‌లో గ్రాండ్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ పైవిధంగా స్పందించారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ మాట్లాడుతూ.. బన్నీ, త్రివిక్రమ్‌ వల్లే ఈ ఆల్బం బాగా వచ్చింది. పదేళ్లలో వంద సినిమాలు చేశాను. త్రివిక్రమ్‌గారితో పనిచేయడానికి నాకు పదేళ్లు పట్టింది. అందుకే పదేళ్లు మించిపోయే పాటలు ఇచ్చాను. 'రేసుగుర్రం', 'సరైనోడు', ఇప్పుడు ఈ సినిమాతో బన్నీతో హ్యాట్రిక్‌ సాధించాను. సాధారణంగా సైకిల్‌ ట్యూబులు పంక్చరవడం మనం చూస్తుంటాం. ఈ సినిమాకి యూట్యూబులే పంక్చరయ్యాయి. నిర్మాతలు నాకు చాలా కాన్ఫిడెన్స్‌ ఇచ్చారు. వంద మిలియన్‌ కాదు వెయ్యి మిలియన్‌ వ్యూస్‌ కొడతాం'' అని తెలిపారు.

దర్శకుడు త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ''నేను వైజాగ్‌లోనే చదువుకున్నా. వైజాగ్‌ అంటే నాకు గుర్తొచ్చేవి అందమైన అమ్మాయిలు, ఆంధ్రా యూనివర్సిటీ, ఆహ్లాదకరమైన బీచ్‌. శ్రీశ్రీ, చలంగారు, రావిశాస్త్రి గారు, సీతారామశాస్త్రిగారు వంటి సాహితీపరుల్ని అందించిన మహానగరం ఇది. ఈ సినిమాని తన భుజం మీద మోసుకుంటూ తీసుకొచ్చిన తమన్‌కు థాంక్స్‌. విలువలతో సినిమా తియ్యండి, మేమెందుకు ఆదరించమో చూపిస్తామని మీరంతా చెప్పారు. అది మాకే కాదు, తెలుగు సినిమాకే నమ్మకాన్నిచ్చింది. ఈ కథను విన్నప్పటి నుంచీ ఈ రోజు దాకా వదిలేయకుండా ముందుండి నడిపించిన మన బన్నీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఫైట్స్‌లో రిస్కుని బలంగా నమ్మి ఈ సినిమాని ఇక్కడి దాకా తీసుకురాగలిగిన బన్నీ.. నాకు తెలిసి తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లగలడు. ఆయన సినిమాని ఎంతగా ప్రేమిస్తాడో నాకు తెలుసు కాబట్టి, మన నేల నుంచి మన కథని గొప్ప సినిమాలుగా ప్రపంచం నలుమూలలకీ చెప్పేంత శక్తిని ఆయనకు మనమందరం ఇవ్వాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు.

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ఫోన్లో వొచ్చేస్తున్నాయ్‌, టీవీలో వచ్చేస్తున్నాయ్‌, థియేటర్లకు జనం రావట్లేదు అనే టైంలో.. మీరు మంచి సినిమా ఇవ్వండి, మేం తెలుగువాళ్లం అందరం కలిసికట్టుగా థియేటర్లకు వచ్చి చూస్తాం. అని చెప్పిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎలాంటి ఆల్బం కావాలని తమన్‌ అడిగాడు. 1 బిలియన్‌ వ్యూస్‌ వచ్చే ఆల్బం కావాలన్నాను. నిజంగా తను 1 బిలియన్‌ వ్యూస్‌ వచ్చే ఆల్బమే ఇచ్చాడు. 'సామజవరగమన' పాటతో 'సాంగ్‌ఆఫ్‌ది ఇయర్‌' అనిపించుకున్నాడు. అలాగే 'రాములో రాములా'తో 'చార్ట్‌ బస్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అనిపించుకున్నాడు. అలాగే ఒక దాన్ని మించి ఒకటి అన్నట్లుగా 'ఓ మైగాడ్‌ డాడీ', 'బుట్టబొమ్మ', 'అల వైకుంఠపురములో', 'సిత్తరాల సిరపడు' పాటలు ఇచ్చి, 'ఆల్బం ఆఫ్‌ ద డికేడ్‌' అనిపించుకున్నాడు. నిజంగా తమన్‌ నేను ఇష్టపడే మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఎంతో కష్టపడుతూ వచ్చి ఈ సినిమాతో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టరుగా కిరీటం పెట్టుకున్నాడు. ఆ కిరీటాన్ని ఈ డికేడ్‌ అంతా దింపకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మిగతా టెక్నీషియన్స్‌ అందరికీ ధన్యవాదాలు. నన్ను 'గంగోత్రి'తో హీరోగా పరిచయం చేసిన మా నాన్న, ఆ తర్వాత 'బన్నీ', 'హ్యాపి', 'బద్రినాథ్‌', 'రేసుగుర్రం', 'సరైనోడు', ఇప్పుడు 'అల వైకుంఠపురములో' తీశారు. మా నాన్నగారు ఎన్నో హిట్లు తీశారు. చిరంజీవిగారితో కొల్లలుగా హిట్లు తీశారు. రజనీకాంత్‌గారితో ఇండస్ట్రీ రికార్డ్‌ కొట్టారు. ఎప్పటికైనా మా నాన్నగారితో ఒక్క ఇండస్ట్రీ రికార్డ్‌ సినిమా కొట్టాలి అనుకొనేవాడ్ని. నిజంగా ఈ సినిమాతో ఫస్ట్‌ టైం ఇండస్ట్రీ హిట్‌ కొడుతున్నా. ఇది నాకు స్వీటెస్ట్‌ మెమరీ' అని చెప్పారు.

హీరోయిన్‌ పూజా హెగ్డే మాట్లాడుతూ.. 'బుట్టబొమ్మ' పాట మొత్తం నామీద రాసినందుకు థాంక్స్‌. ఇప్పుడు నేను తెలుగు అమ్మాయిని అయిపోయాను. షారుఖ్‌ఖాన్‌, సుస్మితాసేన్‌ లాంటి 'ఆరా'ను అల్లు అరవింద్‌గారిలో చూస్తున్నాను. అల్లు అర్జున్‌తో హీరోయిన్‌గా రెండోసారి నటించాను. రాబోయే రోజుల్లో మీరు మరింత సక్సెస్‌ కావాలని ఆశిస్తున్నా' అని చెప్పారు.